Harish Rao News : ‘భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటే మనం.. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటాయి. అందుకు విపణిలో లభించే శానిటరీ ప్యాడ్లు, డైపర్ల స్థానంలో పర్యావరణానికి హాని చేయని వాటిని వినియోగించాలి’ అంటూ వక్తలు సూచించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని అయిదో వార్డులో పైలెట్ ప్రాజెక్టు కింద ‘రుతు ప్రేమ’ పేరిట నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ సామాజిక బాధ్యత కింద ముందుకు రాగా స్టోన్‌సూప్ అనే స్వచ్ఛంద సంస్థ సిద్దిపేట పురపాలకసంఘం సహకారంతో అమలు చేస్తోంది.
పది రోజులుగా వార్డులో సర్వే చేసి, మహిళలకు అవగాహన కల్పించారు. ఆ వార్డులో 1700 మందికి పైగా మహిళలు, యువతులు, శిశువులకు వస్త్రంతో తయారు చేసిన ప్యాడ్లు, డైపర్లు, సిలికాన్ కప్స్ బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళలకు సంబంధించిన రుతుస్రావం అంశంపై బహిరంగంగా చర్చించడం విజయానికి తొలిమెట్టుగా భావించాలన్నారు. పునర్వినియోగమయ్యే వస్త్ర ప్యాడ్లు, కప్స్, డైపర్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. శస్త్రచికిత్స కాన్పులు కర్ణాటక (24 శాతం), మహారాష్ట్ర (28 శాతం) కంటే తెలంగాణలో ఎక్కువగా (62 శాతం) ఉండటం మంచిది కాదని, ముహూర్తాలు చూసుకుని కాన్పులు చేయించుకోవద్దని సూచించారు. పోలీసు కమిషనర్ శ్వేత మాట్లాడుతూ.. ఇదో అభ్యుదయమైన ఆలోచన అని, సిద్దిపేట ప్రగతికి నిదర్శనమని అభివర్ణించారు. అదనపు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, పర్యావరణవేత్త డా.శాంతి మాట్లాడారు. కార్యక్రమంలో బల్దియా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి : ప్రజారోగ్య వైద్యంలో గుణాత్మక పురోగతి: సీఎం కేసీఆర్