గౌరవెల్లి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసేలా భూనిర్వాసితులు సహకరించాలని కోరుతూ.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు అధికారులు భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 85శాతం పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు భూ నష్టపరిహారం విషయమై కోర్టుకెళ్లిన పలువురు గుడాటిపల్లి, గౌరవెల్లి, తెనుగుపల్లి, మదనపల్లి భూనిర్వాసితులను సహకరించాలని కోరారు. గతంలో కోర్టుకు వెళ్లిన భూనిర్వాసితులు అధికారులతో తమ సమస్యలను విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారం కాకుండా ప్రస్తుతం భూమి ధరలు పెరిగిన దృష్ట్యా ప్రస్తుత భూమి రేట్లకు తగినట్టుగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వారి డిమాండ్లను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, రెండు రోజుల్లో గ్రామంలో సర్వే చేపట్టి పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. భూ నిర్వాసితులందరూ తమకు సహకరించి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఏసీపీ మహేందర్, అధికారులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యాన రంగం అభివృద్ధే లక్ష్యం : వర్సిటీ వీసీ నీరజ