పార్కు నిర్మాణం కోసం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పంట పొలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లికి చెందిన కుర్ర కనకరాజు, కుర్ర శ్రీనివాస్‌కు సర్వే నంబర్ 150లో 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇద్దరు అన్నదమ్ములు భూమిని సాగు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ జీవనోపాధి అయిన పందుల పెంపకాన్ని కూడా వదిలేశారు.
వ్యవసాయం మీదే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుంటే తమ పరిస్థితేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అభివృద్ధి కోసం నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎలాగైనా స్పందించి తమ భూములను లాక్కోకుండా చూడాలని వేడుకుంటున్నారు.