కొండపోచమ్మ జలాశయం ప్రాంతంలో రోజు రోజుకు సందర్శకుల తాకిడి అధికం అవుతుండటం వల్ల పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ అంశంపై మర్కూక్ పంప్ హౌస్లో రెండు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. కొండ పోచమ్మ సాగర్ కట్టపై అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి శనివారం, ఆదివారం, పండుగ రోజుల్లో ప్రత్యేక బందోబస్తు ఉండేలా జిల్లా కలెక్టర్, సీపీ వ్యూహ రచనలు చేశారు.
ఈ మేరకు కొండ పోచమ్మ సాగర్ కట్టపై క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. సందర్శకులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు మాత్రమే సందర్శించాలని వారు తెలిపారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సందర్శకులు ఎవరూ నీళ్లలోకి దిగి సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవద్దన్నారు. కట్టపై ఎలాంటి బైక్ రేసులు చేయవద్దని, మద్యం సేవించడం నిషేధించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ కట్ట, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘాతో నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఈవ్ టీజింగ్, దొంగతనాల నివారణ గురించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద