Problems at Komuravelli Mallanna Temple : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న, ఎంతో మంది భక్తులకు ఇంటి ఇలవేల్పు. మల్లికార్జున స్వామి క్షేత్రంలో సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో జాతర మొదలవుతుంది. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం వరకు మూడు నెలలుపాటు వరకు కొనసాగుతుంది. మల్లన్న జాతరకు భక్తులు భారీగా తరలివస్తారు. ఆలయానికి కోట్ల ఆదాయం వస్తున్నా, మౌలిక వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.
వారంలో స్వామివారి కల్యాణం : మార్గశిర మాసం చివరి ఆదివారమైన జనవరి 7న స్వామివారి కల్యాణం జరగనుంది. వారంలో కల్యాణం ఉన్నా, అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. మరోవైపు మల్లన్న దర్శనం (Komuravelli Mallanna Temple) కోసం వచ్చే భక్తులు, దేవాలయ ప్రాగణంలోనే రాత్రి బస చేస్తారు. ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. వారు మంచి నీళ్లు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.12 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు. నాలుగు నెలల కిందట పనులు ప్రారంభించారు. పనులు నత్త నడకన సాగుతున్నాయి.
komuravelli mallanna kalyanam 2021 : కమనీయం.. కోరమీసాల మల్లన్న కల్యాణం..
"భక్తులకు ఎంతో అసౌకర్యంగా ఉంది. మరుగుదొడ్లు, కనీస వసతులు లేవు. మంచినీటి వసతి లేదు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఏళ్లుగా లిఫ్ట్ నిర్మాణం జరుగుతుంది. మహిళలు దుస్తులు మార్చుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కోనేరు నిర్వహణ సరిగ్గా లేదు. అలాగే ఆన్‌లైన్ సేవలు ప్రారంభించాలి. ఇప్పటికైనా పాలకవర్గం దృష్టి సారించి వసతులు కల్పించాలని కోరుతున్నాం." - స్థానికులు
గుట్టపైకి వెళ్లడానికి లిఫ్ట్ లేకపోవడంతో, దివ్యాంగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మరోవైపు గతంలో ఉన్న వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనిని గుర్తించిన గత ప్రభుత్వం, వసతిగృహ నిర్మాణం కోసం రూ.13 కోట్ల నిధులు కేటాయించింది. అయినా ఏళ్లుగా పనులు నత్త నడకన సాగుతున్నాయి. అలాగే ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాల దగ్గర సిబ్బంది అవినీతికి పాల్పడుతూ, ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఘనంగా పట్నం అగ్నిగుండాలు
సమస్యలకు నిలయంగా : ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో, 2018లోనే అప్పటి మంత్రి హరీశ్‌రావు ఆన్‌లైన్ సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇంతవరకు ఆ నిర్ణయం అమల్లోకి రాలేదు. కోనేరు నిర్వహణ సరిగా లేక ఆరుబయటే భక్తులు స్నానాలు చేస్తున్నారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల అలసత్వం, పాలకమండలి పర్యవేక్షణ లోపం కారణంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం (Mallikarjuna Swamy Temple)సమస్యలకు నిలయంగా మారింది. ఇప్పటికైనా అధికారులు వసతులు సమకూర్చి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానికులు, భక్తులు కోరుకుంటున్నారు.
కన్నులపండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం
komuravelli mallanna jathara: వైభవంగా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు