సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట అక్కన్నపేట భాజపా నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సోమవారం జరిగిన అక్కన్నపేట మండల సర్వసభ్య సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధులకు బదులుగా హాజరైన వారి భర్తలు, బంధువులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.
అధికారిక సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు బదులుగా వారి భర్తలు, బంధువులు పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చట్టం ఉన్నప్పటికీ.. ఇష్టానుసారంగా సమావేశాలకు హాజరవుతూ పెత్తనాన్ని కొనసాగిస్తున్నారని భాజపా అక్కన్నపేట మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి ఆరోపించారు. సోమవారం అక్కన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ధర్మారం గ్రామ మహిళా సర్పంచ్‌కు బదులుగా తన భర్త, జనగామ మహిళా సర్పంచ్‌కు బదులుగా ఆమె మామ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. దీనిని ప్రోత్సహించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భాజపా తరఫున నిరసనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్, దాసరి కృష్ణ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. 'ప్రభుత్వం తిరోగమన విధానంలో ప్రయాణిస్తోంది'