తెలంగాణాకే ప్రత్యేకమైన పండగ బతుకమ్మ. దీనికి తోడు దసరానే పెద్ద పండుగగా భావిస్తారు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరూ కొత్త బట్టలు కట్టుకోని.. బంధుమిత్రులతో పండుగ జరుపుకుంటారు. కానీ సిద్దిపేట జిల్లా ధర్మారంలో మాత్రం ఈసారి పండగ వాతావరణం లేదు. గ్రామ పెద్దలు చేసిన కట్టుబాటును గౌరవించి పండుగలు చేసుకోవడం లేదు. గ్రామంలో 13 మందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ఈసారి పండుగను జరుపుకోవద్దని నిర్ణయించుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
అందరం బాగుంటే చాలు:
అంటు వ్యాధులు ప్రబలినప్పుడు గ్రామ దేవతలకు పూజలు చేసే ఆచారం ఇక్కడ ఉంది. అమ్మవారి పేరు మీద దున్నపోతును వదిలిపెట్టి ముడుపులు కడతారు. అప్పటి నుంచి గ్రామంలో ఎవరూ ఎలాంటి పండుగలు చేసుకోవద్దన్నది నియమం. కనీసం ఇంట్లో పూజలు కూడా చేయరు. ఎవరైనా చనిపోతే మాత్రమే డప్పు మోగుతుంది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత గ్రామ దేవతకు ఉత్సవాలు నిర్వహించి.. పండగలు చేసుకుంటారు. ఆగస్టులో ముడుపులు కట్టిన నాటి నుంచి గ్రామంలో కరోనా కేసులు నమోదు కాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. పండగలు చేసుకోలేదన్న బాధ తమకు లేదని.. అందరం బాగుంటే చాలని అంటున్నారు.
భౌతిక దూరమే కదా!
ధర్మారం గ్రామంలోని కట్టుబాటు మూఢనమ్మకం అనిపించినా.. ప్రస్తుతం కరోనా నియంత్రణకు సూచిస్తున్న భౌతిక దూరం అన్న ఉద్దేశం అంతర్లీనంగా ఉంది.
ఇదీ చూడండి: దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దసరా శుభాకాంక్షలు