సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టును (Gouravelli Project) జాతీయ హరిత ట్రైబ్యునల్ త్రిసభ్య కమిటీ సభ్యులు సందర్శించారు. ప్రాజెక్టు అనుమతులు, నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కట్టపైకి వెళ్లి పనులను పరిశీలించారు. అనంతరం జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో గౌరవెల్లి ప్రాజెక్టు (Gouravelli Project) విషయమై పిటిషన్ వేసిన గండిపల్లి గ్రామ భూనిర్వాసితులతో మాట్లాడారు. తమకు రావాల్సిన పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా పెంచారని త్రిసభ్య కమిటీ సభ్యుల ఎదుట భూ నిర్వాసితులు వాపోయారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను త్రిసభ్య కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారని హుస్నాబాద్ ఆర్టీవో జయచంద్రారెడ్డి తెలిపారు. భూ నిర్వాసితుల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకున్నారని వెల్లడించారు.
ట్రైబ్యునల్‌కు తమ నివేదికను సమర్పిస్తామని ఆర్డీవో పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఆయకట్టు కింద లక్షా అరవై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని కమిటీకి వివరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి అనుకూలంగా హరిత ట్రైబ్యునల్‌లో తీర్పు వస్తుందని ఆర్డీవో ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : 3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి: హైకోర్టు