సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కళ నకాసి చిత్రకళ... దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ కళ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితికొచ్చింది. చిత్రకళ తెలిసిన వారు తగ్గిపోవడం వల్ల ఇది అంతరించేపోయే దుస్థితికి దగ్గరలో ఉంది. ఈ అరుదైన కళను కాపాడుకోవాలన్న ఆకాంక్ష కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకొచ్చింది. హస్తకళ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేపాక్షి హస్తకళ సంస్థ సహకారంతో నాలుగు నెలల శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది.
శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తూ..
చేర్యాల పట్టణంలోని నకాసి హస్తకళ భవనంలో 20 మంది మహిళలకు నిపుణులైన నకాసి హస్తకళ కళాకారులచే శిక్షణ అందిస్తోంది. కళాకారులు, మహిళలను రెండు విభాగాలుగా చేసి పది మందికి నకాసి చిత్రకళ, మరో పది మందికి నకాసి చిత్రకళలో ప్రత్యేక గుర్తింపు పొందిన జానపద బొమ్మల తయారీని నేర్పిస్తున్నారు. శిక్షణకు మహిళలకు నెలకు 7వేల 5వందల రూపాయలను అందిస్తూ, శిక్షకులకు 15 వేల రూపాయలు వేతనంగా చెల్లిస్తున్నారు. కనుమరుగువతున్న ఈ కళను బతికేంచేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం 20 మందికి శిక్షణ ఇస్తున్నా.. ఇంకా చాలా మంది ఎదురుచూస్తున్నారని... వారికి అవకాశం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత20 ఏళ్లుగా హస్తకళను వృత్తిగా చేసుకొని జీవిస్తున్నామని, ఈ కళను భవిష్యత్తు తరాలకు అందించడంపై శిక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాటి కళలు నేటికి జ్ఞాపకాలుగా మిగిలిపోకుండా ఉపాధిగా మలచుకోవడమే కాకుండా భావితరాలకు మార్గదర్శకంగా అందించాలంటే కనుమరుగైపోతున్న కళలకు జీవం పోయాల్సిందే... ఇది మన చరిత్ర అని భవిష్యత్తుకు చూపాల్సిన బాధ్యత మనదే..