సిరిసిల్ల, సిద్దిపేట నియోజక వర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి... దుబ్బాకలో ఎందుకు జరుగలేదని ప్రభుత్వాన్నిఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పెళ్లి రోజు నుంచి మరణించేవరకు వెంబడున్నామని చెప్పిన రామలింగారెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసి.. దుర్మార్గులకు మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు.
హరీశ్‌రావు పరిస్థితి తెరాస ప్రభుత్వంలో తీసేసిన తహసీల్దార్ లాగ ఉందన్నారు. తెరాసను ఎదుర్కోవాలంటే యువ నాయకులు ముందుకు రావాలన్నారు. అందులో బాగంగానే కమలాకర్‌ను పార్టీ లోకి రావాలని అడగడానికి వచ్చామన్నారు. కేసీఆర్ఇచ్చిన అన్ని హామీలు తుంగలో తొక్కారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబానికి గుణపాఠం చెప్పాలంటే మనమంతా ఏకం కావాలన్నారు. తెరాసలో కండువా కప్పుకున్న రోజు పండుగ.. తర్వాత దండుగే అని విమర్శించారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని భాజపా బహిష్కృత నేత కమలాకర్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేసంలో ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. భాజపాలో నిబద్ధతతో పని చేసిన నాయకుడు కమలాకర్ రెడ్డి అని అన్నారు. తప్పు చేసిన వారికి టిక్కెట్ ఇచ్చి పనిచేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు.
ఇదీ చూడండి : ప్రజలు గమనిస్తున్నారు.. తెరాసకు గుణపాఠం తప్పదు: బండి