రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మంచినీరు అందించడానికి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పలుచోట్ల నీరుగారుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం, మహ్మదాపూర్ గ్రామాల సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్లు నెల రోజులుగా లీక్ అవుతున్నాయి. నీరు వృథాగా పోతున్నప్పటికీ అధికారులు సరి చేయించడం లేదు.
నాగారం సమీపంలో ప్రధాన రహదారి పక్కనే నెల రోజులకు పైగా పైప్‌లైన్ లీకేజీ అవుతూ చిన్న కుంట ఏర్పడటం గమనార్హం. మహ్మదాపూర్ గ్రామ సమీపంలో రైతులు పంట పొలాలకు వెళ్లే దారిలో పైప్‌లైన్ లీక్ వల్ల రహదారి చిత్తడిగా మారింది. బురదతో నిండిన రోడ్డుపై పంట పొలాలకు వెళ్లడానికి, ధాన్యాన్ని మార్కెట్‌కు సరఫరా చేయడానికి, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
" గతంలో మిషన్ భగీరథ అధికారులకు సమస్యను తెలియజేశాం. వారు పైప్‌లైన్ మరమ్మతులు చేయడానికి వచ్చారు. పైప్‌లైన్ ఉన్న పంట పొలనికి చెందిన రైతు తనకు నష్టమవుతుందని చెప్పడంతో అధికారులు వెళ్లిపోయారు. ప్రస్తుతం పైప్‌లైన్ మరమ్మతుకు ఎలాంటి అడ్డంకులు లేవు. అధికారులకు, సర్పంచ్‌కు తెలియజేసినప్పటికీ మరమ్మత్తు చేయించడం లేదు."
- రైతు
తమ పంట పొలాల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లడానికి వచ్చే వాహనాలు బురదలో బోల్తా పడిన సందర్భాలూ ఉన్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి పైప్‌లైన్‌కు త్వరగా బాగు చేయించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు'