సిద్దిపేట కోమటి చెరువుకు పర్యటక శోభను సంతరించుకుంది. వరంగల్ జిల్లా లక్నవరం వంతెన తరహాలోనే ఈ చెరువుపై వేలాడే వంతెనను నిర్మించారు. లక్నవరం కన్నా 91 మీటర్ల పొడవైన ఈ కోమటి చెరువు వంతెనను మంత్రి హరీశ్‌రావు చొరవతో పర్యటకాభివృద్ధి సంస్థ రూ.6 కోట్లతో నిర్మించింది.
చెరువులో వంద అడుగుల ఎత్తైన 2 పైలాన్ల మధ్యలో గాల్వనైజ్డ్ రోప్‌తో 241 మీటర్ల పొడవైన వేలాడే వంతెనను నిర్మించారు. ఇందుకోసం కొరియా నుంచి దిగుమతి చేసుకున్న తాడును ఉపయోగించారు. వంతెన మధ్యలో 4 అడుగుల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో దాదాపు 200 మంది దీనిపై నిల్చొని కోమటిచెరువు అందాలను ఆస్వాదించవచ్చు. మంగళూరుకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత భరద్వాజ్ దీన్ని రూపొందించారు.
నూతనంగా నిర్మించిన ఈ వంతెనను మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. కోమటిచెరువు అభివృద్ధి ఏళ్ల కలగా పేర్కొన్న మంత్రి హరీశ్... పర్యటక ప్రాంతాన్ని స్వచ్ఛతకు నిలయంగా తీర్చిదిద్దాలని సూచించారు. సిద్దిపేట ప్రజల ఆస్తి అయిన ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. హరీశ్‌రావు నాయకత్వంలో సిద్దిపేట ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
పర్యటకులు టికెట్ కొనుగోలు చేసి కోమటి చెరువును సందర్శించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం పూట మార్నింగ్ చేసే వారి కోసం ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లతోపాటు పిల్లల ఆటాపాటల కోసం పార్కులు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్ ఫర్ దిశ'