Ministers Harishrao Speech at Siddipet IT Hub Inauguration : సిద్దిపేట జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన మాంసాన్ని అందించాలనే లక్ష్యంతో.. ఇర్కోడ్ వద్ద 2 ఎకరాల స్థలంలో రూ.6 కోట్లతో ఏర్పాటు చేసిన "ఆధునిక స్లాటర్ హౌజ్"ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అదేవిధంగా రూ.20 కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
Minister Harishrao & KTR Speech at Siddipet IT Hub Inauguration : అనంతరం సిద్దిపేటలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ ఐటీ హబ్‌తో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వంతో ఇప్పటికే 15 అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలి విడతలో 750 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసిన కంపెనీలు.. రెండు షిఫ్టులు కలిపి 1500 మంది ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఐటీ హబ్ ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన మంత్రులు.. గత తొమిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిపై ప్రసంగించారు.
తెలంగాణ ఆయువుపట్టు సిద్దిపేట గడ్డ : తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. 3 శాతం గ్రామీణ జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 30 శాతం అవార్డులు సాధిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఆయువుపట్టు సిద్దిపేట గడ్డ అని కేటీఆర్ తెలిపారు. సిద్దిపేట స్వచ్ఛబడి స్ఫూర్తితో స్మార్ట్ నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని7.7 శాతం పెంచామన్నారు. మిషన్ భగీరథకు పునాది పడిన గడ్డ సిద్దిపేట అని గుర్తు చేశారు. ఐటీ హబ్‌కు మరిన్ని నిధులు మంజూరు చేసి విస్తరిస్తామన్న కేటీఆర్... సిద్దిపేటలో టీ-హబ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఐటీ ఎగుమతులు కేవలం రూ.56 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం రాష్ట్రం నుంచి రూ.2.40 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ లాంటి నాయకుడి వల్లే రాష్ట్రంలో అద్భుతాలు : రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అందిస్తామంటే గత ప్రభుత్వాలు అది కల అంటూ ఎగతాళి చేసేవారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు. ఆనాటి ప్రభుత్వాల కలను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చి చూపారన్నారు. గుజరాత్‌లో కరెంటు కోతలు ఉన్నాయన్న హరీశ్.. 24 గంటల కరెంటు ఇవ్వడం అసాధ్యం అని జానారెడ్డి అన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడి వల్లే రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతున్నాయన్నారు. సిద్దిపేటకు పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేస్తామని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
'కలలోనైనా సిద్దిపేటకు ఐటీ హబ్ వస్తుందని అనుకున్నామా. రాష్ట్రమే రాకపోతే సిద్దిపేట జిల్లా వచ్చేదా? కేసీఆర్ సిద్దిపేటకు బలమైన పునాది వేశారు. కేసీఆర్ ప్రణాళికలను అమలు చేస్తున్నా. ఐటీ టవర్ ప్రారంభంతో సిద్దిపేటలో 1500 మందికి ఉపాధి వచ్చింది. ఐటీ టవర్ ప్రారంభం రోజునే సంస్థలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. కేటీఆర్ లాంటి ఐటీ మంత్రి మా రాష్ట్రంలో లేరని పక్కరాష్ట్ర ప్రజలు ఫోన్ చేస్తున్నారు. ఐటీ రంగంలో అత్యధిక వృద్ధి రేటు మన రాష్ట్రం సాధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా చక్కగా ఉన్నాయి.'-హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి: