Organic Farmers Mega Market Organic Mela in Siddipet : దేశంలో జనాభా అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో రసాయనిక ఎరువులు, ఆధునిక వంగడాలను ప్రవేశ పెట్టారని.. కానీ వాటిని వాడే విధానంపై రైతులకు అవగాహన కల్పించడంలో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పాలకులు విఫలమయ్యారని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సిద్ధిపేటలోని మల్టీపర్పస్ హైస్కూలులో బాల వికాస ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే సేంద్రీయ రైతుల మెగా మార్కెట్ ఆర్గానిక్ మేళాను మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌లు ప్రారంభించారు.
ప్రపంచమంతా భూసారం సంరక్షణ, టెర్రరిజం నిర్మూలన, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తుంటే.. దేశాన్ని పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి కొట్టుకునే విధంగా చూస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జనాభా పెరగడం మూలంగా వారి ఆహారం కోసం గతంలో వాడిన సేంద్రియ పద్ధతులను పక్కన పెట్టి వ్యవసాయ విప్లవం పేరుతో క్రిమి సంహారక మందులు మొదలు పెట్టామని తెలిపారు. మందుల వాడకం మోతాదు మించడంతో ప్రపంచ వ్యాప్తంగా మరో 50, 60 రకాల పంటలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భూసార పరీక్షలు జరిపి అవసరమైన మందులను వాడుతూ, సేంద్రియ పంటల సాగుకు రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో 50 ఏళ్ల క్రితం వరకు తొలకరి వచ్చే వరకు పశువుల ఎరువులు.. పొలాల్లో పోసి ఎరువులుగా వాడేవారని వివరించారు. ఇవాళ సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూమి సారం కోల్పోతుందని.. భూమిని సారవంతం చేయడంలో సేంద్రియ ఎరువులు ప్రధాన భూమిక పోషిస్తాయని నిరంజన్‌రెడ్డి చెప్పారు.
"రసాయన ఎరువులపై నియంత్రణ లేకపోవడం.. ఒకసారి ఒక ఫ్యాక్టరీకి అనుమతిస్తే వారు ఆ నాణ్యతను కొనసాగిస్తున్నారా లేదా అనేది పట్టించుకోరు. వ్యవస్థల్లో ఉన్న లోపాలను బట్టి రసాయనాలు అమ్మేవారు ఎలాంటి మందులు ఇస్తున్నారు.. అనేది చూడం. దీనివల్ల రైతులు సులభంగా మోసపోవడానికి ఆస్కారం ఉంది. క్రిమిసంహారిక మందులు, రసాయనాలు మోతాదుకు మించి వాడితే భూమి నిస్సారం అయిపోతుంది. అధిక దిగుబడులు వచ్చే వంగడాలు వచ్చాయి. ప్రజల అవసరాలకు మించి పంటలు పండుతున్నాయి." - నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఇవీ చదవండి: