Harishrao on Telangana Agricultural growth rate: అన్ని రంగాల్లో దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణను దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తీర్చిదిద్దిన ఘనత.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన పునరుద్ఘాటించారు. దేశంలో వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతంగా ఉంటే... రాష్ట్రంలో 7.8 శాతంగా ఉందని వివరించారు. సిద్ధిపేట మార్కెట్ యార్డులో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ ప్రారంభించారు. ఆ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో మొదటి పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రం సిద్ధిపేటలో ప్రారంభమైందని, రూ.6400 మద్దతు ధరతో ప్రభుత్వానికి అమ్మితే రైతులకు ఉపయోగకరమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక రైతుకు భరోసా దొరికిందని, కేంద్రం వడ్లు కొనమని చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొని రైతులకు సహకారాన్ని అందించిందని చెప్పుకొచ్చారు. సమైక్య రాష్ట్రంలో ఆనాడు అనేక తంటాలు పడేవారన్న ఆయన.. ఇవాళ తెలంగాణలో ప్రతిగింజకు కాంటాలు వచ్చాయన్నారు.
'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు యాసంగిలో 10 లక్షలు ఎకరాలు సాగు అయ్యేది కాదు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాసంగిలో 53 లక్షల ఎకరాల వరి సాగు అవుతుంది. దేశంలోని ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఏపీ, మధ్యప్రదేశ్‌లు భౌగోళికంగా చాలా పెద్దవైన వరి సాగు జరగడం లేదు. తెలంగాణ ప్రజలకు పని ఇవ్వడంతో పాటు, పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పిస్తుంది. ఒకనాడు వ్యవసాయం దండగ అంటే.. ఇవాళ తెలంగాణలో పండుగ నెలకొంది. తెలంగాణలో నీళ్లు ఫుల్, కరెంటు ఫుల్, చేపలు ఫుల్, పంటలు ఫుల్.. మొత్తంగా తెలంగాణ పవర్ ఫుల్‌గా నిలుస్తుంది.'-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
Harishrao on Kanti Velugu Second Phase : రాష్ట్రవ్యాప్తంగా 25 రోజుల్లోనే... రెండోవిడతలో 50 లక్షల మందికి కంటివెలుగు పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రెండోవిడతలో నేటితో 50 లక్షల మందికి కంటివెలుగు పరీక్షలు పూర్తిచేయడంతో... సిద్దిపేటలోని ఏకలవ్య సంఘం భవనంలో జరుగుతున్న కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. 16 లక్షల మందికి కంటిలోపం ఉన్నట్లు గుర్తించామన్న మంత్రి.. పురుషుల కంటే 3 లక్షల మంది మహిళలు ఎక్కువగా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు.
జూన్ వరకు కంటివెలుగు కార్యక్రమం : కంటివెలుగు కార్యక్రమాన్ని పంజాబ్, దిల్లీ ముఖ్యమంత్రులు ప్రశంసించారన్న మంత్రి హరీశ్... ఆయా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెప్పినట్లు వివరించారు. చివరివ్యక్తి వరకు పరీక్షలు చేసేందుకు వీలుగా... జూన్ వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. ప్రజలకు ఆనంద భాష్పాలు వస్తుంటే ప్రతిపక్షాలకు కన్నీళ్లు వస్తున్నాయని విమర్శించారు. గతంలో కంటి అద్దాలు చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమన్న ఆయన... ఇప్పుడు తెలంగాణ కంటి అద్దాలే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రెండో విడత కంటి వెలుగుకు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
ఇవీ చదవండి: