సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(Auto Credit Co-operative Society) రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు(minister harish rao) ఆకాంక్షించారు. ఆటో డ్రైవర్లు భద్రత, ప్రభుత్వంతో సత్సంబంధాలు కల్పించేందుకే... రాష్ట్రంలో మొదటిసారిగా సిద్దిపేటలో సహకార సంఘం ప్రారంభించామని చెప్పారు. సిద్దిపేటలో 137 మంది ఆటో డ్రైవర్లకు మంత్రి చేతులమీదుగా యూనిఫాంలు అందించారు. ప్రమాదాల్లో మృతి చెందిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సొసైటీ ద్వారా చెక్కులు అందజేశారు. ప్రతి ఒక్కరూ దురవాలట్లకు దూరంగా ఉంటూ... సొసైటీ పరపతిని పెంచుకోవాలని మంత్రి సూచించారు.
జీవన ప్రమాణాలు పెరగాలి
ఆటో డ్రైవర్ల మధ్య ఐక్యతకు నిదర్శనమే ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ అని మంత్రి పేర్కొన్నారు. సమష్టి కృషితో సొసైటీగా ఏర్పాటు చేశామని తెలిపారు. దీనిద్వారా తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. క్రమం తప్పకుండా పొదుపు చేపట్టి... డబ్బులు పొదుపు చేయాలని సూచించారు. ఆటోడ్రైవర్ల జీవన ప్రమాణాలు పెరిగితే తనకు అంతకు మించిన సంతోషం లేదని అభిప్రాయపడ్డారు.
డ్రైవర్లకు ప్రమాద బీమా
సొసైటీ ఏర్పాటుతో పాటు డ్రైవర్లకు శిక్షణ, లైసెన్స్, ఆర్థిక వెసులుబాటు కోసం రుణ సాయం అందజేశామని చెప్పుకొచ్చారు. వారికోసం ప్రమాద బీమా కల్పించామని... కరోనా విపత్కర సమయంలో ఉచితంగా నిత్యావసర సరుకులు అందించినట్లు వెల్లడించారు. గతంలో రూ.5 వేల వరకు రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని... రూ.10 వేల పెంచేలా కృషి చేస్తామని హామీనిచ్చారు.
'ఆటో డ్రైవర్లు క్రమశిక్షణతో పాటు దురలవాట్లకు దూరంగా ఉండాలి. మీపై కుటుంబం ఆధారపడి ఉందని మరవకూడదు. ఆటో డ్రైవర్ కొడుకు కలెక్టర్, ఇంజినీర్, డాక్టర్ కావాలి. అప్పుడే డ్రైవర్ల జీవన ప్రమాణాలు పెరిగినట్లు. పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి. రుణ పరిమితి పెంపుతో పాటు... సొసైటీలో సభ్యుల సంఖ్య పెంచాలి. ఎన్సీడీసీ ద్వారా రూ.2 కోట్ల వరకూ ఆటో డ్రైవర్లకు రుణ సాయం అందించే యోచనలో ఉన్నాం. భవిష్యత్తులో సొంతంగా ఆటో కొనుక్కునే స్థాయికి ఆటో డ్రైవర్లు చేరుకోవాలి. సమాజంలో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దీనికి అందరి సహకారం అవసరం.'
-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇదీ చదవండి: రాష్ట్రంలో త్వరలో 'తెలంగాణ దళిత బంధు' పథకం అమలు