సిద్దిపేట పట్టణం 27వ వార్డు కాళ్లకుంట కాలనీలోని 180 మంది లబ్ధిదారులకు విపంచి కళా నిలయంలో నివాస స్థల పట్టాలను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. నిజమైన లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు, పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
"30 ఏళ్ల క్రితం కాళ్లకుంట కాలనీ లేఅవుట్లో ప్రభుత్వం 1,558 మంది పేదలకు ఇళ్ల పట్టాలను ఇచ్చింది. గడిచిన 30 ఏళ్లలో అనేక మార్పులు జరిగాయి. కాలనీ సందర్శన సమయంలో ఇళ్లు తమ పేరు మీద లేవని.. నల్లా, కరెంట్ కనెక్షన్లు ఇతరుల పేరు మీద ఉన్నాయని.. వాటిని ప్రభుత్వ రికార్డుల్లో సరి చేయాలని కాలనీ వాసుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చేవి. ఈ సమస్యలు, ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం ఆలోచించి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాం. నిజమైన లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు, పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు పట్టాల పంపిణీ చేస్తున్నాం. తొలిదశలో 180 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇస్తున్నాం. మిగిలినవారికి త్వరలో అందజేస్తాం."
-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
లబ్ధిదారులకు ఇంటి పట్టా, మ్యుటేషన్ పట్టా, నల్లా కనెక్షన్ పట్టాను మంత్రి పంపిణీ చేశారు. కాలనీలో ఎక్కడా మురికి నీరు బయటకు రాకుండా యూజీడీ కనెక్షన్ ప్రతి ఇంటికి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. చెత్తను తగలపెట్టొద్దని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని తెలిపారు.
ఇదీ చూడండి: అయోధ్య రామ మందిర నిర్మాణానికి పవన్ భారీ విరాళం