పంటలు ఎండిపోతున్నాయని కాపాడాలన్న రైతుల విజ్ఞప్తికి మంత్రి హరీశ్ రావు చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కారం చూపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న హరీశ్ రావును కలిసిన రైతులు.. తమ పంటలు ఎండిపోతున్నాయని కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి... మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ జలాశయానికి నీటిని తీసుకెళ్లే కాలువకు గండి పెట్టి సమీపంలో ఉన్న కూడవళ్లి వాగులోకి నీటిని వదిలితే సమస్య పరిష్కారం అవుతుందని గుర్తించారు. ఈ విషయాన్ని అక్కడి నుంచే ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
సానుకూలంగా స్పందించిన కేసీఆర్ వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. కూడవళ్లి వాగు పరివాహక ప్రాంతంలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాల పంటకు సాగు నీరు అందనుంది. తమ సమస్యకు తక్షణ పరిష్కారం చూపిన మంత్రి హరీశ్ రావుకు, సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చదవండి : ఫలించిన గులాబీ దళపతి వ్యూహం.. ఇక దూకుడే!