సిద్దిపేట జిల్లాలో రైల్వే లైన్ పనులను తొందరగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సధర్మ రాయుడు, రాజీవ్ రహదారి చీఫ్ ఇంజినీరు పి.మధుసూదన్ రెడ్డితో జిల్లాలో రైల్వే లైను, రాజీవ్ రహదారి ప్రగతి, పురోగతి అంశాలపై సమీక్షించారు. రైల్వే పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాలపై రైల్వే డిప్యూటీ సీఈని ఆరా తీశారు.
రైల్వే లైన్ పనుల గురించి.. భూ సేకరణ ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భూ సేకరణ సమస్యలు ఏవైనా ఉంటే రైల్వే అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. రైల్వే లైను కోసం దాదాపు ఇంకా 157 ఏకరాల భూసేకరణ పెండింగులో ఉందని... సేకరించిన భూమిలో 131 ఎకరాలు ఇంకా రైల్వే శాఖకు రెవెన్యూ శాఖ అప్పగించాల్సి ఉందని మంత్రి తెలిపారు.
దుద్దెడ నుంచి సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో చేపట్టాల్సిన రీచ్‌ల వారీ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రైల్వే సీఈకి మంత్రి సూచించారు. పాత అలైన్‌మెంట్ ప్రకారం కాకుండా కొత్త అలైన్‌మెంట్ రైల్వే లైను విషయమై.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వారికి అవసరమయ్యే విధంగా అంశాలను ప్రతిపాదించాలని జిల్లా కలెక్టర్, రైల్వే డిప్యూటీ సీఈలను మంత్రి హరీశ్ రావు కోరారు.