రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా చేపట్టి నిజమైన అర్హులకే వచ్చేలా చూడాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల కోసం ఎంపిక చేసిన లబ్దిదారులు, ప్రజా స్క్రూటినీలో వచ్చిన అభ్యంతరాలు, పున:పరిశీలన, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో కలిసి మంత్రి సమీక్షించారు. నిజమైన లబ్దిదారులను ఎంపిక చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
నర్సాపూర్‌లోని రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపు కోసం దరఖాస్తులు ఆహ్వానించగా... 11,506 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన దరఖాస్తులను సములాగ్రంగా అధికారులచే విచారించగా 1600 మంది ప్రాథమికంగా అర్హులుగా తేల్చారన్నారు. లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేపట్టాలన్న ఉద్దేశ్యంతో ప్రజా స్క్రూటినీ కోసం ఎంపికైన జాబితాను వార్డుల వారీగా విభజించి సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోని నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించామన్నారు.
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, కేటాయింపు నిరంతర ప్రక్రియ అని... అర్హులందరికీ న్యాయం చేస్తామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు ముజమ్మీల్ ఖాన్, ఎస్ పద్మాకర్, శిక్షణ కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో అనంత రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.