Harish Rao: మన వడ్లు కేంద్రం కొనాలంటే రైతులు, కార్యకర్తలు ఇళ్లపై నల్లజెండాలు ఎగరేయాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల యాసంగి ధాన్యం కొనేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. గత ప్రభుత్వాలు వడ్లు కొంటే.. మీరేందుకు తీసుకోరని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మోదీ హయాంలో అచ్చే దిన్ కాదు సచ్చే దిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. కేంద్రానికి ప్రజల నుంచి లాక్కోవడమే తప్ప ఇవ్వడం తెలియదని మండిపడ్డారు. మన్ కీ బాత్ కాదు.. ముందుగా మా రైతుల బాధలు వినాలన్నారు. రైతుల వడ్లు కొనే బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు.
ప్రతి ఇంటిమీద రేపు నల్లజెండా ఎగరేయాలి. మన వడ్లు కొనేంత వరకు నల్లజెండా ఎగురుతూనే ఉండాలే. మన వడ్లను కొనేందుకు కేంద్ర దిగిరావాలే. ప్రతి రైతు, కార్యకర్తలు నిరసన తెలపాల్సిందే. కేంద్రం ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసేలా దిల్లీలో కూడా నిరసన చేయనున్నాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పోరాటం చేస్తున్నాం. మనం చేసే నిరసనలతో కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరగాలే. రేపు జెండా ఎగరేసి ఈనెల 11న దిల్లీలో పెద్దఎత్తున నిరసన చేద్దాం.
- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి
కేంద్రం ద్వంద్వ విధానాలతో రైతులను రోడ్ల మీదకు తెస్తోందని హరీశ్ రావు విమర్శించారు. విదేశాలకు ధాన్యం ఎగుమతులు కేంద్రమే చేయాలన్నారు. ఎస్టీలకు 11 శాతం రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసి పంపితే ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదన్నారు. భాజపా హయాంలో కరెంట్‌ను మించి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో 16,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్నారని ఆరోపించారు. రేపు జరగబోయేది కేంద్ర ప్రభుత్వ శవయాత్ర.. ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు నల్లజెండాలు ఎగరేసి ఈనెల 11న దిల్లీలో కేంద్రం కళ్లు తెరిపించేలా ఆందోళన చేపడతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ దీక్షలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కేంద్రం విడుదల చేసిన ఆ నివేదికలో తెలంగాణ పేరే లేదు: ఎమ్మెల్సీ కవిత