Harish Rao: కాళేశ్వరం నీళ్లొచ్చాక గ్రామాల్లో పశువులు కట్టేసేందుకు జాగా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు చమత్కరించారు. పేదలందరికీ ఒక్క పైసా ఖర్చు లేకుండా రెండు పడక గదుల ఇళ్లను మేమే కొబ్బరికాయ కొట్టి గృహ ప్రవేశం చేయిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌లో నిర్మించిన ఇళ్లను మంత్రి ప్రారంభించారు.
గ్రామానికి చెందిన ప్రజలందరీ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయాలని వైద్యాధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గ్రామంలోనే 70 రకాల ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇబ్రహీంపూర్ ఆదర్శ గ్రామంగా నిలుస్తుందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇబ్రహీంపూర్ పాఠశాలలో వందశాతం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
పశువులకు వసతి సముదాయాలు: గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, కిచెన్ అండ్ డైనింగ్ షెడ్, సామూహిక పాడి పశువుల వసతి సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ ద్వారా పంటలపై పిచికారీని ప్రారంభించి, ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం నాట్కో సహకారంతో మొబైల్ క్లినిక్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఒక పైసా మీకు ఖర్చు కాకుండా ఇళ్లు నిర్మించి కొబ్బరికాయ కొట్టి మరీ మీ చేతికిస్తున్నాం. వచ్చే ఏడాది ఇబ్రహీంపూర్ పాఠశాలలో వందశాతం ఇంగ్లీష్ మీడియం ప్రారంభించనున్నాం. దళితబంధు కూడా మీ గ్రామంలో అమలు చేస్తాం. పశువులకు చక్కని వసతి కల్పించేలా వసతి సముదాయం ఏర్పాటు చేశాం. మీ గ్రామంపై నాకు ఎప్పటికైనా ప్రేమ ఉన్నది. మీ ఊరి అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేస్తున్నారు.
- హరీశ్ రావు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి