రెవెన్యూ వ్యవస్థలో 70 ఏళ్లుగా భూ వివాదాలు ఉన్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పెరుగుతుందన్నారు. భూముల విషయంలో నమోదైన కేసుల్లో 50 శాతంపైగా వివాదాలకు సబంధించిన కేసులే ఉన్నాయన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పహాణీలో పేరు మార్పిడి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సేవలు వేగంగా అందుతున్నాయని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా, అదనపు కలెక్టర్ సభ్యుడిగా భూ వివాదాల సత్వర పరిష్కారానికి ట్రైబ్యునల్ ఏర్పాటు చేశామన్నారు.ట
మూడు గంటల్లో పనిపూర్తి :
పైసా ఖర్చు లేకుండా 3 ఏళ్లు పట్టే పనిని 3 గంటల్లో పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ధరణి అందుబాటులోకి వచ్చాక కలెక్టర్ కూడా మార్చలేని విధంగా అత్యంత పారదర్శకంగా ఉందని తెలియజేశారు. పార్ట్-బిలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. పెండింగ్ మ్యుటేషన్స్ పరిష్కరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసిందన్నారు. మ్యుటేషన్లు అమలు చేయడంలో రాష్ట్రంలో సిద్దిపేట, మెదక్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సతీష్ కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు పద్మాకర్, ముజామిల్ ఖాన్, ఆర్టీవోలు, జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతు బంధు సమితి సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.