నూతన చట్టాలను రద్దు చేసేంత వరకు రైతులతో కలిసి పోరాటం చేస్తామని, రేపు జరిగే భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా హరీశ్ సమక్షంలో కాసర్ల అశోక్ బాబు, పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. కేంద్ర వైఖరిపై విమర్శలు గుప్పించారు.
రైతులను రోడ్డున పడేశారు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట గుదిబండగా మారాయని హరీశ్ ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం చేసింది ఏమీ లేదనీ, కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ చట్టాలతో రైతులు రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
మద్దతు ధర పెంచడానికి సిద్ధం
లేవీ సేకరణపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తే సన్న రకపు వరి ధాన్యానికి మద్దతు ధరను పెంచి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హరీశ్ అన్నారు. నెల రోజుల్లో యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్ ఛైర్మన్ రాజారెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'పోస్టులు భర్తీ చేస్తారా.. కారుణ్య మరణాలకు అనుమతిస్తారా.?'