రాష్ట్రంలో వరి ధాన్యానికి ఎక్కువ ధర చెల్లించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి, మక్కల కొనుగోలు కేంద్రాలు ఆయన ప్రారంభించారు. వరికి మద్దతు ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించినా రాష్ట్రం నుంచి ధాన్యాన్ని సేకరించబోమని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిందని గుర్తు చేశారు. లేఖతో రైతులకు ఒక్క పైసా ఎక్కువ చెల్లించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
'కేంద్రం వల్లే రైతులకు నష్టాలు'
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని హరీశ్ కోరారు. రైతు బాగుండాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం లేదని గుర్తు చేశారు. కేంద్రం నిర్ణయాల వల్ల నేడు విదేశీ మక్కలు రాష్ట్రాలకు వస్తున్నాయన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నష్టమొచ్చినా ఆదుకుంటాం...
మక్క కొనుగోలుకు కేంద్రం పైసా ఇవ్వడం లేదన్నారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లిందని... రైతు బాగుండాలనే సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. ఇందులో 26 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అవసరం ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్