సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్, భాజాపాలపై విమర్శలు గుప్పించారు. 'కాలిపోయే మోటార్లు... బావుల దగ్గర మీటర్లు... ఉచిత కరెంటుల మధ్య పోటీ.. కాలిపోయే మోటార్లు అంటే కాంగ్రెస్.. బావుల దగ్గర మీటర్లు అంటే భాజాపా... ఉచిత కరెంట్, కడుపు నిండా సంక్షేమం అంటే తెరాస' అని అన్నారు. బావుల దగ్గర మీటర్లు... ఉచిత కరెంటు మధ్యన పోటీ మీరు ఏవైపు ? అని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోవిందా పూర్, మధిర, పొసాన్ పల్లిలో మంత్రి హరీష్ రావుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మ పండుగ అయినా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్క చెల్లెల అభిమానం చూస్తే చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
"70 ఏళ్ల కాంగ్రెస్, భాజపా పరిపాలనలో లేని అభివృద్ధి 5ఏళ్ల తెరాస పాలన లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఇంటింటికి తాగు నీరు ఇచ్చాం. మంచి నీళ్ల కోసం గతంలో ట్యాంకర్ల వెనకాల బిందెలతో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఎండాకాలంలో బోర్లు వేస్తే చుక్క నీరు రాకపోయేది. పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష పదహారు వేలు ఇస్తున్నాం. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం."
-హరీశ్ రావు, మంత్రి
పోసాన్ పల్లి గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుందాం అని మంత్రి పులుపునిచ్చారు. అభివృద్ధి జరగాలి అంటే తెరాస ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని చెప్పారు. ఓట్లు కోసమే కాంగ్రెస్, భాజపా నాయకులు వస్తారని... కష్టసుఖాల్లో తెరాస అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: మీ "కోటి కొలువులు" ఏమయ్యాయి?: మంత్రి హరీశ్ రావు