భాజపా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తుంటే... కేంద్రంలో ఉన్న భాజపా సర్కార్ వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు పెట్టేందుకు జీవో తీసుకు వస్తుందని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండలం ఎల్కల్, బేగంపేట్, వడ్డేపల్లి, కొత్తపల్లి, రామ్ సాగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్లతో ప్రజలు భారీగా తరలివచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు.
![minister harish rao election campaign at rayapol mandal in siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-srd-16-31-manthri-harish-pracharam-av-ts10054_31102020095807_3110f_00263_208.jpg)
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు పెట్టడం ప్రారంభించిందని అన్నారు. సీఎం కేసీఆర్ ఉచితంగానే రైతులకు విద్యుత్‌ను అందిస్తున్నారని మంత్రి చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలంతా ఈ ఉప ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను దేశంలో భాజపా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా కారణంగానే దేశంలో నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రసవత్తరంగా మారిన దుబ్బాక ఉపఎన్నిక పోరు