గూడు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ రెండో విడత లబ్ధిదారులకు ఆయన ఇంటి కేటాయింపు ధ్రువపత్రాలు అందజేశారు. పేదల మీద ప్రేమతో.. సొంతింటి మాదిరిగా మనసు పెట్టి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేశామని హరీశ్ రావు తెలిపారు.
పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. బస్తీ దవాఖానా వచ్చే వరకు తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసిఆర్ నగర్ కు ఆర్టీసీ బస్సు, బడి, రేషన్ షాప్, గుడి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను అమ్మినా, అద్దెకు ఇచ్చినా.. తిరిగి స్వాధీనం చేసుకుంటామని హరీశ్ రావు హెచ్చరించారు.