Harish Rao Comments: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా కార్యకర్తలు పనిచేయాలని తెరాస కార్యకర్తలకు మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలో జరిగిన తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, భాజపాలపై మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, భాజపా వాళ్లకు అబద్ధాలు తప్ప ఏమి రావంటూ ఆయన మండిపడ్డారు.
నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు రాలేదన్నారన్న మంత్రి హరీశ్.. ఏ భాజపా నేత వచ్చినా తాను తీసుకెళ్లి చూపిస్తామన్నారు. కేంద్రమంత్రి గడ్కరీ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగుందన్నారన్న మంత్రి.. నడ్డా ఒక్క ఎకరా నీరు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కేంద్రమంత్రే అన్నారని మంత్రి హరీశ్ వెల్లడించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో భాజపాకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిలిండర్ ధరపై వాట్సప్‌లో భాజపా నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ అన్నారు. రాహుల్‌గాంధీ ఏ హోదాలో డిక్లరేషన్ ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. గెలిచిన ప్రభుత్వాన్ని కాపాడుకోలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్ అంటూ మంత్రి చురకలంటించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ గెలవలేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో సహాయం చేయడం చాలా ముఖ్యమని తెరాస కార్యకర్తలకు మంత్రి హరీశ్ సూచించారు. కార్యకర్తలు పార్టీకి, ప్రభుత్వానికి మూల స్తంభాల్లాంటివారన్నారు. సిద్దిపేట అభివృద్ధి గురించి ప్రతిపక్షాలే ప్రచారం చేస్తాయన్నారు. ప్రతి పనిలో సిద్దిపేట మున్సిపాలిటీనే ఆదర్శంగా తీసుకుంటారన్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే సిద్దిపేట జిల్లా కాకపోయేదని.. ఎక్కడ అవార్డు వచ్చినా సిద్దిపేట పేరు తప్పకుండా ఉంటుందని మంత్రి హరీశ్ వెల్లడించారు.
"ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా కార్యకర్తలు పనిచేయాలి. నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు రాలేదన్నారు. ఏ భాజపా నేత వచ్చినా నేను తీసుకెళ్లి చూపిస్తా. కేంద్రమంత్రి గడ్కరీ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగుందన్నారు. పార్లమెంట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కేంద్రమంత్రి అన్నారు. సిలిండర్ ధరపై వాట్సప్‌లో భాజపా నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాహుల్‌గాంధీ ఏ హోదాలో డిక్లరేషన్ ఇచ్చారో అర్థం కావడం లేదు. గెలిచిన ప్రభుత్వాన్ని కాపాడుకోలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ గెలవలేదు." -మంత్రి హరీశ్ రావు
ఇవీ చదవండి: