సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు జన్మదినాన్ని తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్‌లో మాజీ కౌన్సిలర్, తెరాస నాయకుడు రవికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ ప్రారంభించారు. అంతకుముందు కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ శివారులోని కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గజ్వేల్‌లో జరిగిన వేడుకల్లో వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని తొగుటలో తెరాస నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి... మాస్కుల పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ