తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రంగనాయక, కొమురవెల్లి మల్లన్న రిజర్వాయర్ల ప్రధాన, కుడి, ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని, ప్రధాన కాలువలకు అనుసంధానంగా నిర్మించనున్న చిన్న కాలువల భూ సేకరణను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో సమీక్ష
కాలువలు, పిల్ల కాల్వలు పూర్తయితే రైతుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని, కాల్వల కోసం భూ సేకరణ, దాని అవశ్యకతను వివరిస్తూ.. మండలాలు, గ్రామాల వారీగా మంత్రి సమీక్షించారు. సిద్ధిపేట నియోజక వర్గంలోని చిన్నకోడూర్, నంగునూరు, సిద్ధిపేట రూరల్, అర్బన్, నారాయణరావు పేట మండలాల్లో క్షేత్ర స్థాయిలో ఉత్పన్నమైన అంశాలపై అధికారులతో చర్చించారు.
త్వరలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభం
రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా లింకేజీ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌పై మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. ఈ మేరకు మండలాలు, గ్రామాల వారీగా స్థానికుల ద్వారా వచ్చే సమస్యలపై ఆయా మండల తహసీల్దార్లు, ప్రజా ప్రతినిధుల సహకారంతో పూర్తి చేస్తారని పెండింగులో ఉన్న అంశాలన్నీ పరిష్కారం చూపేలా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి మంత్రి సూచించారు. అనంతరం సిద్ధిపేట మున్సిపాలిటీ నర్సాపూర్ వద్ద 2వేల పైచిలుకు వరకు రెండు పడక గదుల ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని.. వీటికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు జరిపిస్తామని హరీశ్ రావు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ ఆనంద్, ఇరిగేషన్ ఈఈ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 24 గంటల్లో 8,392 కొత్త కేసులు.. 230 మరణాలు