సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆలయ పరిసరాల్లో విడిది చేస్తోన్న భక్తులు బోనాలతో ప్రదక్షిణలు చేసి స్వామి వారికి తమ మెక్కులను చెల్లించుకుంటున్నారు.
మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శివసత్తుల నృత్యాలతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతవరణం నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులందరూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయాధికారులు సూచించారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో గల ధర్మగుండం లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. భక్తుల కోసం బయటనే స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఆలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద పట్నాలను, అగ్ని గుండాలను నిర్వహిస్తుండడంతో భక్తుల రద్దీ మరింత పెరగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: 'గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగరేయటమే లక్ష్యం'