komuravelli mallanna jathara: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం వైభవంగా జరిగింది. మూడు నెలలుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు ముగింపు పలికారు. పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు అగ్ని గుండ ప్రవేశం చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వీరభద్రస్వామి అర్ధంతో వెళ్లి బియ్యం సుంకు ఇచ్చి.. ఆ తర్వాత అగ్నిగుండాల కోసం భూమి పూజ నిర్వహించారు. అనంతరం భద్రకాళి మాత అలంకరణ, ధాన్యమావాహనాది అష్టోత్తర శతనామ పూజ, అగ్ని ప్రతిష్ట చేసి కట్టెలు పేర్చి మంట రగిలించారు.

సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండం ఎదుట పూజలు నిర్వహించి చుట్టూ అష్ట దిక్పాలకులు, భైరవ పూజలు, బలిహరణ చేశారు. స్వామి వారి చిత్ర పటం, ఖడ్గాలు, ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌తో పాటు ఇతరులు ముందుగా అగ్నిగుండాన్ని దాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు, శివసత్తులు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల ప్రవేశం చేసేందుకు పోటీ పడ్డారు. పోలీసులు ఒక్కొక్కరుగా అగ్నిగుండంలోకి అనుమతి ఇచ్చారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, బోనాలు నెత్తిన పెట్టుకొని బారులు తీరిన భక్తజనం, రంగుల ముగ్గులతో మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేట జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ మహేందర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: