ఇంజనీరింగ్ అద్భుతంగా రికార్డులకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలకఘట్టం నేడు పూర్తికానుంది. ప్రాజెక్టులో చివరిదైన, పదో ఎత్తిపోతల ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వరుసజలాశయాల్లో కొండపోచమ్మ సాగర్ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా... ప్రారంభోత్సవం చేసుకోనుంది. కోటి 25లక్షల ఎకరాల మాగాణి లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న రాష్ట్రప్రభుత్వం... ఆ దిశగా సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతికి శ్రీకారం చుట్టింది. అందులోఅత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు. రికార్డు సమయంలో చరిత్రను తిరగరాస్తూ పని పూర్తిచేసుకున్న ఆ ఎత్తిపోతల పథకం ద్వారా దశలవారీగా ఫలాలు అందిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, పంపుహౌజ్ సహా కాల్వలు, సొరంగమార్గాల పని రికార్డు సమయంలో పూర్తిచేసిన సర్కార్.య... గత వేసవినుంచి నీటిఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది.
ఏడాది క్రితం...
సరిగ్గా ఏడాది క్రితం... ప్రాజెక్టులోని మొదటి పంపు ప్రారంభం కాగా ప్రస్తుతం 10 దశ ఎత్తిపోతల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మేడిగడ్డ ఆనకట్ట ఎగువన కన్నేపల్లి పంపుహౌజ్ వద్ద... 88 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ నుంచి నీరు ఎత్తిపోస్తున్నారు. ఆ తర్వాత వివిధ దశల్లో అన్నారం, సుందిళ్ల, నందిమేడారం, గాయత్రి, అనంతగిరి, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్, అక్కారం పంపుహజ్‌లోని పంపుల ద్వారా నీటిని ఎగువకు తరలిస్తున్నారు. ఇప్పటికే అక్కారం పంపుహౌజ్ నుంచి గోదావరిజలాలు మార్కుక్ పంపుహౌజ్‌కు చేరాయి. మార్కుక్‌లో మోటార్లు ప్రారంభిస్తే నేరుగా కొండపోచమ్మ సాగర్ జలాశయంలోకి... గోదావరి జలాలు తరళివెళ్తే.... ప్రాజెక్టులో చివరిదైన పదో దశకు ఎత్తిపోతల ప్రక్రియ పూర్తవుతుంది. కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలు చేరితే... 618 మీటర్ల ఎత్తుకు వెళ్లినట్లవుతుంది. ఆ ప్రక్రియతో మేడిగడ్డ వద్ద లక్ష్మీఆనకట్ట నుంచి కొండపోచమ్మసాగర్ వరకు 214 కిలోమీటర్లు గోదావరి జలాలు ప్రవహించినట్లవుతుంది.
అందాలన్ని అందుకునేందుకు...
15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ జలాశయం సిద్ధమైంది. జలాశయం చుట్టూ 15.8 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణానికి 1540కోట్లు వ్యయమైంది. జలాశయం కింద రెండు లక్షల 85 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చెల్ -మల్కాజ్ గిరి జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చనుంది. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం కేశవాపూర్ వద్ద నిర్మించే జలాశయానికి కొండపోచమ్మసాగర్ నుంచే నీరు వెళ్తుంది. జలాశయంలోకి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో పదోదైన, చివరి ఎత్తిపోతల పూర్తవుతుంది. కన్నేపల్లి వద్ద 88 మీటర్ల ఎత్తు నుంచి తరలించే జలాలు కొండపోచమ్మసాగర్ వద్ద 618 మీటర్ల ఎత్తుకు చేరినట్లవుతుంది. అంటే 530 మీటర్ల ఎగువకు నీటిని తరలించినట్లవుతుంది.
ఇవీ చూడండి: ప్రారంభానికి 'కొండపోచమ్మ' సిద్ధం..