కుటుంబాల మధ్య ఆప్యాయత, అనురాగాల బంధమే మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచంలో చాటిచెపుతోంది. అనేక దేశాల్లో ఒకే ఇంట్లో అనేక మందితో కూడిన కుటుంబాలు ఉండవు. ఇంకా మనదేశంలోనే ఆ సంస్కృతి ఉంది. ‘బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించేయొద్ధు.’ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యాన్ని తెలిపే మంచిమాట ఇది.
నీతి కథలు.. ముచ్చట్లు...
లాక్‌డౌన్ దుష్పరిణామాలు పక్కన పెడితే.. కుటుంబాల్లో అనూహ్యమైన మార్పులు ఏర్పడ్డాయి. ఉద్యోగాలు, పనులు పక్కన పెట్టిన కుటుంబ నిర్వాహకులు.. పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యులకే సమయాన్ని వెచ్చిస్తున్నారు. బంధువుల బాగోగులపై ఆరా తీస్తున్నారు. పిల్లల చదువులకు సెలవులు రావడం వల్ల.. మంచి, చెడు చర్చించుకుంటున్నారు.
సిద్దిపేటలోని అన్నపూర్ణేశ్వరి కాలనీలోని ఇంటి యజమాని రవి తన పిల్లలకు నీతి కథలు, తన చిన్ననాటి క్రమశిక్షణ ముచ్చట్లు చెబుతున్నారు. తాతనానమ్మలు భగవంతుడి లీలలు, రామాయణం, భారతం, భాగవతం ధారావాహికలు, సినిమాలు పిల్లలకు చూపిస్తూ సందేహాల నివృత్తి చేస్తున్నారు.
పచ్చీసు, కైలాసం లాంటి పాత తరం ఆటలను ఎలా ఆడాలో ఇతర కుటుంబ సభ్యులకు తెలిసిన వారు పరిచయం చేస్తున్నారు. వీటి వల్ల సమస్యలు వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. అనుభవాలను చెప్పడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. డబ్బుల నిర్వహణ, భవిష్యత్తు అవసరాలపై కుటుంబ సభ్యులు చర్చించుకొని అంచనాకు వస్తున్నారు. వ్యాపార కుటుంబాలు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో.... ఎలా కొనసాగించాలో ఆలోచనలు పంచుకుంటున్నారు.
ఇంట్లో టీవీ, సెల్‌ఫోన్‌లకు పరిమితం కాకుండా కుటుంబ సభ్యులతో గడపడానికి యత్నించాలి. అందరూ కలిసి రోజులో ఒకసారైనా భోంచేస్తే సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో వృద్ధులు, పిల్లల అవసరాలపై ప్రత్యేక దృష్టి పెడితే మానసికంగా గట్టిగా ఉంటారు.
మెలకువలు నేర్పుతూ...
సిద్దిపేటకు చెందిన చిత్రకారుడు రుస్తుం సహా అతని కుమారుడు నహీం రుస్తుం, కుమార్తె రుబీనా రుస్తుం చిత్రకారులుగా రాణిస్తున్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. 12 మంది ఒకే ఇంట్లో ఉంటున్నారు. రుస్తుంకు భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లు, ఒక కుమార్తె, ముగ్గురు మనవరాళ్లు, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రత్యేకించి మనవళ్లు, మనవరాళ్లకు చిత్రకళపై మెలకువలు నేర్పుతున్నారు.
కుటుంబ విలువలే దేశాభివృద్ధికి బాట...
కుటుంబాలు విలువలతో మనగలిగితే దేశాభివృద్ధికి బాటలు పడతాయి. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని, విలువలను కొనసాగించాలి. సంస్కృతి, సంప్రదాయాలున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. విలువలు లేకపోతే మానసికంగా దెబ్బతింటారు. సభ్యుల మధ్య ఆప్యాయతలు, అలకలు, నిష్కల్మషంగా మాట్లాడుకోవడమే ఆరోగ్యానికి, ఆనందానికి గట్టి పునాది.
-ఉమాపతి, సైకాలజిస్టు, సిద్దిపేట