రాష్ట్రంలో రెండు నగరపాలక సంస్థలు, అయిదు పురపాలక సంఘాల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది. ఖమ్మంలో 60 డివిజన్లకు గానూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మెుత్తం 417 మంది నామినేషన్లు వేయగా.... 522 నామపత్రాలు దాఖలయ్యాయి. కేవలం ఆఖరి రోజునే 377 నామపత్రాలు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తెరాస నుంచి అత్యధికంగా 163 నామినేషన్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున 125 దాఖలవ్వగా.... భాజపా నుంచి 84 నామపత్రాలు వేశారు. జనసేన 12, సీపీఎం 35 , సీపీఐ నుంచి ఏడు నామినేషన్లు దాఖయ్యాయి. అన్ని డివిజన్లలో కలిపి స్వతంత్రులు 76 మంది నామపత్రాలు అందజేశారు. అత్యధికంగా 43వ డివిజన్ లో 14 మంది అభ్యర్థులు 18 నామినేషన్లు దాఖలు చేశారు.
గ్రేటర్ వరంగల్‌లో చివరి రోజు నామినేషన్లు పోటెత్తాయి. మొత్తం వెయ్యి 10 మంది అభ్యర్ధులు 1487 సెట్ల నామపత్రాలు సమర్పించారు. 66 డివిజన్లలోనూ 12 వందల 14 మంది 17 వందల 53 నామినేషన్లు వేశారు. ఇందులో తెరాస 706, భాజాపా 294, కాంగ్రెస్ 247 మంది నామినేషన్ దాఖలు చేశారు.
సిద్దిపేట మున్సిపాలిటీలో మూడు రోజుల్లో 361 మంది అభ్యర్థులు 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో తెరాస 208, భాజపా 118, కాంగ్రెస్ 58, ఎంఐఎం 10, సీపీఐ 1, సీపీఎం 1, స్వతంత్రులు 171 నామినేషన్లు సమర్పించారు. ఆఖరి రోజున 407నామపత్రాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డు కౌన్సిలర్ ఉపఎన్నికకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎంఐఎం పార్టీ నుంచి తహసీన్ బేగం, కాంగ్రెస్ నుంచి జెహర నహాది నామ పత్రాలు సమర్పించారు. ఎన్నిక ఏకగ్రీవం కోసం తెరాస దూరంగా ఉండనుంది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పుర ఎన్నికలో చివరి రోజు 99 మంది అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు. పట్టణంలో ని 20 వార్డులకు 149 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జడ్చర్లలో 241 నామ పత్రాలు దాఖలవ్వగా... ఇందులో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. 79 మంది స్వతంత్రులు నామినేషన్ వేశారని అధికారులు వివరించారు. పురపాలికలోని 27 వార్డులకు గాను 241 నామ పత్రాలు వచ్చాయని స్పష్టం చేశారు.