Harish Rao Fires On Central Government: కేంద్ర ప్రభుత్వం జై జవాన్-జై కిసాన్ అనే నానుడి లేకుండా చేసేందుకు చూస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఓవైపు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ.. మరోవైపు సైనికులను, అగ్నిపథ్ ద్వారా దేశ యువతను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం రాష్ట్రాలకు కోతలు, వాతలు తప్ప ఇచ్చిందేమి లేదని హరీశ్ రావు ఆక్షేపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన ఆత్మ కమిటీ ఛైర్మన్, దౌల్తాబాద్, తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కాలం అయినా, కాకపోయినా రెండు పంటలు పండిస్తున్నారని తెలిపారు. తాగు, సాగునీరు ఇచ్చి దుబ్బాక నియోజకవర్గం గోస తీర్చింది సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. విద్యుత్ మీటర్ల నిబంధన లేకపోతే రాష్ట్రానికి రెండేళ్ల నుంచి రావాల్సిన రూ.12 వేల కోట్లు ఎందుకు నిలిపివేశారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. చట్టంలో విద్యుత్ మీటర్లు లేకపోతే వెంటనే రూ.12 వేల కోట్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రాలలోనైనా ఉన్నాయా అని హరీశ్ రావు ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొట్టింది: రైతుబంధు, అమృత్ సరోవర్, హర్ ఘర్ కో జల్, మూగ జీవాలకు అంబులెన్స్ 1962లను దేశమంతా అమలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ లేదని తెలిపారు. కేవలం రాష్ట్రంలో మాత్రమే అమలవుతుందని.. ఇది సీఎం కేసీఆర్ ఘనత అని పేర్కొన్నారు.
భాజపా పాలనలో రూ.400 ఉన్న సిలిండర్ ధరను.. రూ.1200 చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. మరో 15 రోజుల్లో ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేయగానే తెరాస బీఆర్ఎస్గా మారనుందని హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'కేసీఆర్‌కు దమ్ముంటే భారాస పేరుతో మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలి'
పార్టీ కార్యకర్తతో మహిళా ఎమ్మెల్యే పెళ్లి.. చీఫ్ గెస్ట్‌గా సీఎం