Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం గుప్పిస్తూ.. ఒకరి వైఫల్యాలు మరొకరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ఒకటే పాట పాడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు వచ్చే ఎన్నికల్లోనూ విజయఢంకా మోగిస్తామని ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది.
Harish Rao Comments on BJP and Congress : ఇప్పటికే ముఖ్యంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో 100పైగా స్థానాలను గెలుస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మరో వైపు కేటీఆర్ ఈ దఫా ఎన్నికల్లో అత్యధిక మెజారీటీతో మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటామని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈసారి కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని బల్ల గుద్ది చెబుతున్నాయి. అధికార బీఆర్ఎస్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో ముందుకు వెళ్తుంటే.. ప్రతిపక్షాలు హమీల అమలు, వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్తూ తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లాలోని శ్రీగిరిపల్లిలో ఏర్పాటు చేసిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన హరీశ్.. కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
'రైతు వ్యతిరేక చట్టాలు.. వేలాది మంది రైతుల చావుకు కారణం అయ్యాయి. 3 గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి శాపంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రానికి శాపంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ప్రజల బతుకులు ఆగమైపోతాయి. కేసీఆర్ రైతులను కడుపులో పెటుకుని చూసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి గురువు.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. మాజీ సీఎం చంద్రబాబు శిష్యుడు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారు.' - హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
కేసీఆర్ రైతులను కడుపులో పెటుకుని చూసుకుంటున్నారు : బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రానికి శాపంగా మారాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ పార్టీల పాలనలో ప్రజల బతుకులు ఆగమైపోతాయని విమర్శించారు. బీజేపీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు.. వేలాది మంది రైతుల చావుకు కారణం అయ్యాయన్న హరీశ్‌రావు.. మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రైతులను, తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హరీశ్‌రావు ఆరోపించారు.
ఇవీ చదవండి :