Gouravelli Project Expats Protest: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద భూ నిర్వాసితులు రెండు నెలలుగా తమకు పరిహారం ఇవ్వాలంటూ ప్రాజెక్ట్ వద్ద దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెడకు ఉరితాడు బిగించుకొని గుడాటిపల్లి గ్రామస్థులు వినూత్నంగా నిరసన తెలిపారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కంటే ముందే ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్ట్ ముంపులో భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారం ఇవ్వాలని రెండు నెలలుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. 2007లో నిర్మాణ పనులు ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్ట్ను 2014లో కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న సీఎం కేసిఆర్ హామీ ఏమైందని వారు నిలదీశారు.
ఈ ప్రాజెక్టు తర్వాత 2016 లో నిర్మాణం ప్రారంభించిన మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, అనంతగిరి ప్రాజెక్టులను పూర్తిచేశారు. ఇది గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఏది ఏమైనా తమకు పూర్తి నష్టపరిహారం వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని అక్కడి వారు తెలిపారు.
ఇదీ చదవండి: మల్లన్నసాగర్ కాదు.. ఇది తెలంగాణ జలసాగర్: కేసీఆర్