చిన్నపాటి మెలుకువలతో వ్యవసాయాన్ని లాభసాటి చేసి చూపిస్తున్నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లికి చెందిన గూళ్ల మల్లయ్య. వ్యవసాయ భూమి లేదని మల్లయ్య నిరాశ చెందలేదు. మండలంలోని పందిళ్లలో 7ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. 5 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. మిగతా రెండెకరాల్లో కూరగాయలు సాగు చేశాడు. రెండు రోజులకోసారి మార్కెట్లో విక్రయించి అధిక ఆదాయం అర్జిస్తున్నాడు.
డిమాండ్‌కు అనుగుణంగా
అందరిలా కాకుండా మార్కెట్లో ఏ సమయంలో ఏ కూరగాయలకు డిమాండ్ ఉంటుందో ముందుగానే అంచనా వేస్తాడు మల్లయ్య. అందుకు అనుగుణంగానే కూరగాయల పంటలు వేస్తాడు. ప్రస్తుతం మిరప, క్యారెట్, బెండ, కాకర, టొమాటోతో పాటు బెండలో అంతర పంటగా సొరకాయ సాగు చేశాడు. అన్నింటికీ కలిసి సుమారు 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్టు మల్లయ్య చెబుతున్నాడు. టమాట మినహా మిగిలినవన్నీ దిగుబడులు వస్తున్నాయి.
నేరుగా వినియోగదారులకే
ఒకే పంటను నమ్ముకోకుండా నాగుగైదు రకాలు సాగు చేస్తున్నాడు. ఒక దానిలో నష్టం వచ్చినా మరొకటి ఆదుకుంటుందని మల్లయ్య ఉద్దేశం. దళారులకు విక్రయించడం వల్ల ప్రయోజనం ఉండదని భావించి... హుస్నాబాద్, పందిళ్ల, కోహెడ, సిద్దిపేటలో జరిగే వార సంతల్లో నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నాడు. రెండు రోజులకోసారి మార్కెట్‌కు తరలిస్తు తాజా కూరగాయలు అందిస్తున్నందున వినియోగదారులు ఎక్కువగా మల్లయ్య వద్దనే కొంటున్నారు. కూరగాయలు సాగు చేసే రైతులకు విత్తనాలు, ఎరువులపై ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని మల్లయ్య కోరుతున్నాడు.
ఇదీ చూడండి: దేశంలో కరోనాకు మరొకరు బలి- 4కు చేరిన మృతులు