సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ముదిరాజులను బీసీ-ఏలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పడాన్ని ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య బెస్త ఖండించారు.
'దేని ప్రాతిపదికన ?'
అసలు ముదిరాజులను బీసీ(ఏ) గ్రూపులోకి దేని ప్రాతిపదికన చేరుస్తారని భాజపా అభ్యర్థి రఘునందన్ రావుపై మల్లయ్య బెస్త ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోనే హైకోర్టు..
ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని హైకోర్డు కొట్టివేసిన సంగతి రఘునందన్ రావుకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కేసు సుప్రీం కోర్టులో ఉందని.. ఈ కనీస విషయం తెలియకుండా భాజపా అభ్యర్థి ప్రకటన ఎలా చేస్తారని ఎద్దేవా చేశారు. రఘునందన్ వ్యాఖ్యలు సుప్రీం కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తుందని.. ఈ అంశంపై వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు మల్లయ్య స్పష్టం చేశారు.
'రిజర్వేషన్ పెంపు ఏదీ ?'
ఒకప్పుడు బీసీ ఏలో 33 కులాలు ఉండేవని.. క్రమంగా వాటి సంఖ్యను 66కు తెచ్చారని మల్లయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కులాల సంఖ్యకు అనుగుణంగా 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం 7 శతం మాత్రమే అమలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
లేదంటే బహిష్కరిస్తాం..
ముదిరాజుల రిజర్వేషన్ అంశంపై ప్రకటనను వెంటనే రఘునందన్ రావు ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో దుబ్బాక గంగపుత్రులు, బీసీ ఏ ప్రజలతో కలిసి ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు.
నష్టం భాజపాకే..
దుబ్బాక పరిధిలో సుమారు 25 వేల గంగపుత్రులు ఉన్నారని.. ఇలాంటి అవకాశవాద రాజకీయాల వల్ల నష్టపోయేది భాజపానేనని సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీహరి బెస్త తెలిపారు. బీసీ ఏ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సార్లు ప్రయత్నించినా.. కోర్టులు తమకు అండగా నిలిచి ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాయని శ్రీహరి గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ రిజర్వేషన్ల అంశాలను ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మల్చుకోవాలని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రయత్నించడం మంచిది కాదని హితవు పలికారు.
ఇదీ చదవండిః నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్