Few Health Benefits of Consuming Okra Daily : బెండకాయ రుచిగా ఉన్నా బంకగా ఉంటుందని కొందరు తినేందుకు ఇష్టపడరు. అయితే దాంతోనే ఎన్నో లాభాలున్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. బ్రెజిల్‌లోని పరైబా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఫ్లొవియో కరోలినా అలోన్సా బురిటి, థామెరిస్ లాసినండా దెంటాస్, ఎలియాన్ రోలిమ్ ఫ్లోరెంటినోలు సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఫుడ్ ప్రాజెక్టు పేరుతో జరిపిన అధ్యయనంలో బెండకాయలోని తేమ జిగురు లేదా బంక (ఓక్రా మ్యూసిలేజ్) మానవ శరీరంలోని పలు రుగ్మతల నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని తేలింది. నానబెట్టిన పచ్చి బెండకాయ తేమ జిగురును తాగితే రోగాలను నివారించవచ్చని తేలింది.
ఈ పరిశోధన వ్యాసం ప్రముఖ ప్రచురణ సంస్థ ఎల్స్‌వెయిర్ ఆధ్వర్యంలో నడిచే యూరోపియన్ పాలిమర్ జర్నల్‌లో ప్రచురితమైంది. బెండకాయ ద్రావకాన్ని మూడు రకాలుగా తయారు చేసుకోవచ్చు. మొదటిగా బెండకాయలను నిలువునా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఒక పచ్చి బెండకు ఆరు రెట్ల నిష్పత్తి (1:6)లో నీరు పోయాలి. ఉదయాన్నే పచ్చి బెండకాయ ముక్కల్ని తీసేసి ఆ నీటిని తాగాలి. రెండో పద్ధతిలో అయితే 4-5 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఫ్రిడ్జ్‌లో 12 గంటలు ఉంచి నానబెట్టాలి. ఉదయం లేవగానే పరిగడుపున ఈ నీళ్లను తాగాలి. మూడో పద్ధతిలో ఆర్బిటల్ షేకర్లలో 522 వాట్ల అల్ట్రాసోనిక్ శక్తిని ఉపయోగించి 59 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 30 నిమిషాలు ఉంచాలి లేదా 55 నుంచి 65 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య కనీసం 20 నుంచి 30 నిమిషాల వరకు నానపెట్టాలి.
'సహజంగా కూరగాయల్లో ఎన్నో అద్భుత గుణాలుంటాయి. అనారోగ్యానికి గురికాకుండా బెండకాయ జిగురు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న జబ్బులను సైతం తగ్గిస్తుంది. ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలోనూ ఇదే రుజువవుతోంది. ఇలాంటి ప్రయోజనాలను గుర్తించడానికే తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనాలు చేస్తోంది'- పిడిగం సైదయ్య, శాస్త్రవేత్త
పరిశోధనలో వెల్లడైన అంశాలు ఇవే : బెండకాయ జిగురు అనేది సహజ పాలీశాకరైడ్‌ల మిశ్రమం. ఇందులో ఎల్-రామ్‌నోస్, డీ-గెలాక్టోస్, ప్రొటీన్లు, ఖనిజాలతో సంబంధం ఉన్న గెలాక్టురోనిక్ ఆమ్లం ఉంటాయి. బెండకాయ కంటే దాని నుంచి వచ్చే జిగురులో క్యాల్షియం, జింకు ఎక్కువ. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్, యాంటీట్యూమర్, హైపోగ్లైసీమిక్, యాంటీమైక్రోబయల్, యాంటీఅల్సరోజెనిక్ లక్షణాలు ఉంటాయి. నానబెట్టిన బెండకాయ నీటిలో విటమిన్-ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందులోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల రక్తప్రసరణ కూడా బాగా పెరుగుతుంది. హైబీపీ తగ్గడంతో పాటు రక్తంలోని చక్కెర స్థాయినీ తగ్గించవచ్చు.
జీర్ణశక్తిని, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది. ఈ నీటిని కంటి చూపు సమస్య ఉన్న వారు తాగితో ఎంతో మంచిది. అంతేకాకుండా పేగు ఆరోగ్యానికి దోహదం చేసి మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు నివారిస్తుంది. చర్మ సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తాయి. చర్మ సంబంధిత సమస్యలు సైతం తగ్గిపోతాయి. ఈ బెండకాయ జిగురు జుట్టు పెరుగుదలకు సైతం దోహదపడుతుంది. బెండకాయల్లో ఉండే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
డైలీ ఒక గ్లాస్ బెండకాయ వాటర్ - మీ శరీరంలో అద్భుతాన్ని చూస్తారు! - Okra Water Health Benefits
షుగర్ పేషెంట్లు బెండకాయ తింటే మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే! - Ladies Finger For Diabetes