IND VS SA India Won T20 Series and Records : సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సీనియర్లతో కూడిన టెస్టు జట్టు పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇప్పుడు కుర్రాళ్లతో కూడిన భారత టీ20 జట్టు దక్షిణాఫ్రికాలో అదిరే ప్రదర్శన చేసింది. సఫారీ జట్టును దాని గడ్డపైనే మట్టికరిపించి నాలుగు టీ20ల సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంది. తిలక్ వర్మ (120 నాటౌట్; 47 బంతుల్లో 9×4, 10×6), సంజు శాంసన్ (109 నాటౌట్; 56 బంతుల్లో 6×4, 9×6) శతకాలు బాదేయడం వల్ల సిరీస్ చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 135 పరుగులతో అద్వితీయ విజయం సాధించింది. తిలక్, సంజులకు తోడు అభిషేక్ శర్మ (36; 18 బంతుల్లో 2×4, 4×6) కూడా మెరుపులు మెరిపించాడు.
అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పలు రికార్డులను కూడా నమోదు చేసింది. మొత్తంగా 7 రికార్డుల వరకు నమోదు అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.
విదేశాల్లో ఇదే అత్యుత్తమ స్కోర్ - ఈ మ్యాచ్‌లో భారత్ సాధించిన స్కోరు 283/1. విదేశాల్లో టీ20లో టీమ్ ఇండియాకు ఇదే అత్యుత్తమ స్కోరు. సౌతాఫ్రికాలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. టైటాన్స్ (2022లో నైట్స్‌పై 271/3) రికార్డును భారత్ బ్రేక్ చేసింది. టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై భారత జట్టు 297/6 స్కోరు నమోదు చేసింది.
ఒకే క్యాలెండర్ ఏడాదిలో ఇంటర్నేషనల్ టీ20ల్లో మూడు సెంచరీలు బాదిన తొలి ప్లేయర్ సంజూ శాంసన్. 2024లోనే అతను మూడు శతకాలు సాధించాడు.
ఇంటర్నేషనల్ టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో తిలక్ రెండో స్థానంలో నిలిచాడు. శాంసన్ మొదటి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో తిలక్ ఐదో ప్లేయర్.
ఇదే తొలి సారి - ఓ ఇంటర్నేషనల్ టీ20 ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు (ఐసీసీ పూర్తి సభ్య దేశాలు) సెంచరీలు బాదడం ఇదే తొలి సారి. అన్ని టీమ్స్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇది మూడో సారి మాత్రమే. ఈ ఏడాది చైనాపై జపాన్, 2022లో బల్గేరియాపై చెక్ రిపబ్లిక్ ప్లేయర్స్ ఈ ఘనత సాధించారు.
అత్యధిక సిక్స్‌లు - ఈ మ్యాచ్‌లో భారత్ బాదిన సిక్సర్లు 23. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు ఇవే అత్యధిక సిక్సర్లు కావడం విశేషం. సంజూ(9), అభిషేక్ శర్మ (4), తిలక్ వర్మ(10) సిక్స్‌లు బాదారు. దీంతో టాప్-10 టీమ్స్‌లో టీమ్ ఇండియాదే రికార్డు. అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ (22) రికార్డును ఇప్పుడు భారత్ బ్రేక్ చేసింది. మొత్తంగా జింబాబ్బే (27) అగ్ర స్థానంలో కొనసాగుతోంది.
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పార్టనర్ షిప్ - టీ20ల్లో భారత్ తరఫున సంజూ, తిలక్ కలిసి అత్యధిక భాగ్యస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరు 86 బంతుల్లో 210 పరుగులు నమోదు చేశారు. అంతకుముందు అప్ఘానిస్థాన్‌పై రింకూ సింగ్ - రోహిత్ శర్మ కలిగి 190 పరుగులు జోడించారు.
ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా 200కు పైగా స్కోర్లు - ఇప్పుడు నాలుగో టీ20లో సంజూ, తిలక్ సెంచరీలు బాదడం వల్ల 200కుపైగా స్కోర్ నమోదు అయింది. అలా ఒకే క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ సెంచరీలు నమోదు అవ్వడం వల్ల 7 సార్లు టీమ్ ఇండియా 200కుపైగా స్కోర్లు చేసింది.
- రోహిత్ శర్మ - 121* వర్సెస్ అఫ్గానిస్థాన్
- అభిషేక్ శర్మ - 100 vs జింబాబ్వే
- సంజూ శాంసన్ - 111 vs బంగ్లాదేశ్
- సంజూ శాంసన్ - 107 vs సౌతాఫ్రికా
- తిలక్ వర్మ - 107 vs సౌతాఫ్రికా
4వ టీ20లో భారత్ అద్వితీయ విజయం - సిరీస్ కైవసం
4వ టీ20లో శతకొట్టిన సంజూ శాంసన్, తిలక్ వర్మ - పగిలిన లేడీ ఫ్యాన్ దవడ!