Captain Rohit Sharma and Ritika Sajdeh blessed with baby boy : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో తండ్రి అయ్యాడు. అతడికి రెండో సంతానం కలిగింది. హిట్ మ్యాన్ భార్య రితికా సజ్దే శుక్రవారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని సమాచారం. దీంతో రోహిత్ శర్మ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ జంటకు ఇప్పటికే ఓ కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.
తొలి టెస్ట్‌లో ఆడే అవకాశాలు! - కాగా, భార్య రితికా సజ్దే నిండు గర్భిణి కావడం, డెలివరీపై డాక్టర్లు ఇచ్చిన సమాచారం కారణంగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లలేదు. దీంతో అతడు ఈ నెల 22న ప్రారంభమయ్యే బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు దూరమవుతాడని వార్తలు కూడా వచ్చాయి. తన భార్య రితికా త్వరలో రెండోసారి బిడ్డకు జన్మనివ్వనుండటం వల్ల, తనను తొలి టెస్టు నుంచి మినహాయించాలని రోహిత్ శర్మ బీసీసీఐని కోరాడట. అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు శుక్రవారమే రితిక ప్రసవం అయిపోవడం వల్ల రోహిత్ తొలి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
రోహిత్, రితికా ప్రేమించి పెళ్లి - ఇకపోతే రోహిత్ శర్మ, తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో 2015, డిసెంబర్ 13న ఈ జంట వివాహం గ్రాండ్‌గా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా ఈ అందాల జంటకు 2018 డిసెంబరు 30న ఓ కూతురు జన్మించింది. పాపకు సమైరాగా నామకరణం చేశారు.
బోర్డర్ గావస్కర్ షెడ్యూల్ ఇదే - భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024 - 25 సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు నవంబర్ 22 - 26 (పెర్త్‌లో); రెండో టెస్టు డిసెంబరు 6 - 10 (అడిలైడ్‌లో డే & నైట్); మూడో టెస్టు డిసెంబరు 14 -18 (బ్రిస్బేన్‌లో); నాలుగో టెస్టు డిసెంబరు 26 - 30 (మెల్‌బోర్న్‌లో); ఐదో టెస్టు జనవరి 3 - 7 (సిడ్నీలో) వరకు జరగనున్నాయి. గతేడాది వరకు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌గా కొనసాగిన ఈ ట్రోఫీ, ఈ సారి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌గా నిర్వహించనున్నారు.
అత్యధిక సిక్స్‌లు, విదేశీ గడ్డపై అత్యుత్తమ స్కోర్ - సఫారీలపై విజయంతో భారత్ ఖాతాలో 7 రికార్డులు