సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన వృద్ధ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాజీవ్-కళావతి దంపతులు కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం మహారాష్ట్ర వెళ్లారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆ దంపతులను వారి కొడుకులు సొంత గ్రామమైన దుబ్బాకలోని పాత ఇంట్లో వదిలి వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దురు కుమార్తెలు ఉన్నారు. కానీ పట్టించుకోవడం లేదు.
చుట్టుపక్కలవారు
పూర్తిగా ఏమి చేయలేని వయసులో ఉన్న వృద్ధులను చూసి చుట్టుపక్కలవారు చలించిపోయారు. ఆ వృద్ధులకు భోజనం పెడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి ఇల్లు మొత్తం కూలిపోయింది. ఇంట్లోకి వర్షపు నీరు చేరడం వల్ల ఎక్కడ పడుకోవాలో, ఎలా ఉండాలో తెలియని పరిస్థితి. వర్షంలో తడిసి బిక్కు బిక్కు మంటూ పడుకోవడానికి ఎవరైనా వసతి కల్పిస్తే బాగుండని ఎదురు చూశారు. సుమారు నాలుగు రోజులుగా పస్తులుండే పరిస్థితి వచ్చిందని ఆ దంపతులు చెబుతున్నారు.
పరిమళించిన మానవత్వం
శుక్రవారం రాత్రి ఆవేదనతో ఉన్న వృద్ధులను ఆ కాలనీలోని నలుగురు యువకులు ఉదయాకర్, రాజు, కల్యాణ్, తదితరులు కలిసి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారి దీనస్థితిని కల్యాణ్ స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఫోన్ చేసి వివరించారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని అందుకు తగిన సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
అభినందన
పాఠశాల భవనంలో వసతి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఎంఈఓ ప్రభుదాస్ ద్వారా గది తాళాలను యువకులకు అందించారు. త్వరలోనే తానే స్వయంగా వచ్చి బాధిత కుటుంబానికి చేయూత అందిస్తామని ఆ వృద్ధులకు భరోసా ఇచ్చారు. వారిని తీసుకెళ్లి ప్రత్యేక గదిలో యువకులు భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు కల్పించారు. ఆ వృద్ధ దంపతులను ఓ గండం నుంచి గట్టించడంతో యువకులను అందరూ అభినందించారు. ఇంత జరుగుతున్నా వారి కన్న కొడుకులు తిరిగి రాలేదు.
ఇదీ చూడండి : ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ఈసారి ఇంట్లోనే జరుపుకుందాం