కార్యకర్తలే తెరాసకు పట్టుకొమ్మలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ చేతుల మీదుగా ఆయన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్, భాజపాలు ఏనాడు కార్యకర్తల గురించి పట్టించుకోలేదు విమర్శించారు.
తెరాస కార్యకర్తలకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతోందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి తెరాస కార్యకర్త సభ్యత్వ నమోదులో పాలుపంచుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి: ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి