Tragedy in Siddipet District : ఆదివారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు కుమార్తె వివాహం.. ఇంట్లో అప్పటికే సందడి వాతావరణం నెలకొంది. మామిడి ఆకులతో పందిళ్లు సిద్ధమయ్యాయి. చుట్టాలు, ఆడపిల్లలతో ఆ ఇల్లు పండగ వాతావరణం సంతరించుకుంది. ఇంతలోనే.. ఆ ఇంట్లో ఒక విషాద వార్త అందరినీ కలవరపాటుకు గురి చేసింది. ఇంటి పెద్ద ఆత్మహత్యకు పాల్పడటంతో పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో.. చావు డప్పుల చప్పుడు వినిపించింది.
కుమార్తె వివాహానికి అప్పు పుట్టక తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో చోటుచేసుకుంది. కుమార్తె వివాహం జరిపించడానికి డబ్బులు సరిపడక.. అప్పు పుట్టకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ తండ్రి.. బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బస్వాపూర్ పంచాయతీ పరిధి ముత్తన్నపేటకు చెందిన వేల్పుల అయిలయ్య (45) గొర్రెల కాపరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అప్పు కోసం అనేక తిప్పలు: ఇద్దరు మంచి చదువులు చదివారు. డిగ్రీ పూర్తి చేశారు. ఈ క్రమంలో కుమార్తెకు వివాహం జరిపించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏఆర్ కానిస్టేబుల్ అయిన తన మేనల్లుడితో వివాహం జరిపించడానికి నిర్ణయించారు. పెద్దల సమక్షంలో కట్నకానుకలు మాట్లాడుకున్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటల 15 నిమిషాలకు మంచి ముహూర్తం కూడా నిర్ణయించారు. దీంతో ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి ఖర్చులకు అవసరమైన డబ్బు కోసం అయిలయ్య అనేక ప్రయత్నాలు చేశాడు. తన దగ్గర ఇది వరకే దాచిపెట్టిన డబ్బులను ఒక్క దగ్గరకు చేర్చాడు. అయినా కుమార్తె వివాహానికి ఆ డబ్బులు సరిపోలేదు.
దీంతో తెలిసిన వారిని, ఇరుగుపొరుగు వారిని అప్పు అడిగాడు. అప్పు కోసం చాలా తిప్పలు పడ్డాడు. అయినా అంతటా నిరాశే ఎదురవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భాజా భజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు మేళాలు మోగడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: