Crops protect with Bear: కోతులు, అడవి పందుల బెడదతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థలు అన్నీఇన్నీ కావు. చేతికొచ్చిన పంట వన్యప్రాణుల పరం కాకుండా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల రైతులు వినూత్నంగా ఆలోచించారు. ఎలుగుబంటి వేషంతో వాటి బారి నుంచి పంటలకు రక్షణ కల్పించుకుంటున్నారు.
ఎలుగుబంటి వేషధారణతో..
గ్రామ శివారులో అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న భూముల్లోని బీర, మక్కలు, వరి పంట కాపాడుకునేందుకు ఎలుగుబంటి వేషధారణ చిట్కా ప్రయోగించారు. గతంలో పంటలు నాశనం చేసిన కోతులు, వీరి వినూత్న ఆలోచనతో అడవిపందులు పారిపోవడంతో విలువైన పంటను కాపాడుకుంటున్నారు. గతంలో అటవీఅధికారులకు ఫిర్యాదుచేసి అలసిపోయాకే ఈ నిర్ణయం అమలుచేస్తున్నట్లు తెలిపారు.
రోజుకి 500 రూపాయలు
హైదరాబాదులో తయారు చేస్తారని తెలుసుకున్న రైతులు రాజధానికి వెళ్లి రూ.10 వేలు వెచ్చించి కొనుగోలు చేశారు. పంటలను కాపాడేందుకు ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఓ కూలీకి ఎలుగుబంటి వేషధారణ వేయించి కాపలా పెడుతున్నారు. రోజుకి 500 రూపాయలు కూలీకి చెల్లిస్తున్నారు. దాదాపు 25 ఎకరాల పంటకు నష్టం వాటిల్లకుండా ఎలుగుబంటి వేషధారణ ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రోజు కోతులు పంటకు నష్టం కలిస్తున్నాయి. అందుకే హైదరాబాద్కు వెళ్లి ఎలుగుబంటి బొమ్మను కొనుగోలు చేశాం. కిరాయి ఇస్తామన్నారు. కానీ మేం ఉండాలని చెప్పి రేటు ఎక్కువైనా కొన్నాం. కోతల బెడద నుంచి పంటను రక్షించేందుకు ఈ విధంగా చేస్తున్నాం. -భాస్కర్ రెడ్డి, నాగసముద్రాల రైతు
కోతులు రోజు మా పంటలను పీకేయడం, నాశనం చేయడం జరుగుతోంది. ఈ సమస్య నుంచి పంటను రక్షించేందుకు ఎలుగుబంటి బొమ్మను తీసుకొచ్చాం. అటవీశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. హైదరాబాద్కు వెళ్లి పదివేలు వెచ్చించి కొనుగోలు చేసి తీసుకొచ్చాం.- మల్లేశం, రైతు
ఒక్కసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే పది రోజుల వరకు పంటల వైపు మళ్లీచూడవని కర్షకులు తెలుపుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే కోతులు, అడవిపందుల నివారణపై రాష్ట్రస్థాయిలో కమిటీ వేసినందున... వాటి బెడద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: