తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీసులపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఓ మాజీ సైనికుడు ఫిర్యాదు చేశారు. రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు చంద్ర గౌడ్... తన రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో 2019లో భూమిని కొనుగోలు చేశారు. అది చదును చేసి విత్తనాలు వేస్తుండగా తమ పొలం వద్దకు పోలీసులు వచ్చి అక్రమ కేసులు పెట్టడమే కాకుండా... ట్రాక్టర్‌ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ భూమి తన పేరు మీద ఉన్నట్లు పాస్ బుక్‌ను చూపించినప్పటికీ పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. చేర్యాల సిఐ, ఎసైలపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు భూమి అమ్మిన దినేశ్ కుమార్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉందని... ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరారు. మాజీ సైనికుడు చేస్తున్న పోరాటానికి పలు బీసీ సంఘాలు మద్దతు పలికాయి.
ఇదీ చదవండి: రేషన్ కార్డు పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి: మంత్రి గంగుల