రాష్ట్రంలోనే ధరణి పోర్టల్లో ఆస్తుల గణన పూర్తయిన తొలి మున్సిపాలిటీగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అవతరించిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రకటించారు.. ప్రత్యేక కార్యాచరణ, మార్గదర్శకాలతో మున్సిపాలిటీకి ఈ అరుదైన ఘనత దక్కిందన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8587 ఆస్తులకు గాను 8245 ఆస్తుల నమోదు చేసి రాష్ట్రంలో గజ్వేల్ ప్రథమ స్థానంలో నిలిచింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 9న ఆస్తుల నమోదును ప్రారంభించిన 81 మందికి పైగా అధికారులు, సిబ్బంది.. 27 బృందాలుగా ఏర్పడి మున్సిపాలిటీలోని మొత్తం ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్రంలోనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీలో ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచినందుకు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సర్వే వేగవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన జిల్లా అదనపు కలెక్టర్ ముజాంమిల్ఖాన్, మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి, కమిషనర్ కృష్ణారెడ్డిలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.